'రాంబాబు' సీన్లు కట్ చేయవీల్లేదంటూ డిమాండ్
విజయవాడ: పూరీ జగన్నాథ్, పవన్ కళ్యాణ్‌ల కలయికలో రూపొందిన కొత్త చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' వివాదంలో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, నైజాంలో ఈ చిత్ర పంపిణీదారు దిల్ రాజుల కార్యాలయాలపై దాడులు సైతం జరిగాయి. ప్రభుత్వం కలగచేసుకుని కమిటీ వేసి ఈ చిత్రంలో కట్స్ తో విడుదల చేయమంది. అక్కడితో ఈ వివాదం అయిపోయింది అనుకున్నారు. కానీ మరో వైపు నుంచి ఆ కట్స్ చేయకూడదంటూ డిమాండ్స్ మొదలయ్యాయి.
'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో తొలగించిన సీన్లను యథావిధిగా ఉంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సెన్సార్ అయిన సినిమాను కమిటీ పేరుతో సీన్లను తొలగించడం దారుణమన్నారు. చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ఇల్లు, ఆఫీసుపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చిరంజీవి, పవన్ అభిమానులు తలుచుకుంటే వారి ఉప్పెనలో టీఆర్ఎస్ కొట్టుకుపోతుందని, కళా రంగానికి ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టడం హేయమన చర్య అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
అలాగే కెమెరామెన్ గంగతో.. రాంబాబు చిత్రం ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదని వ్యాఖ్యానించారు. అయినా వాటిలోని మూడు పాత్రలను గుమ్మడి కాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు తమ(వారి)తో సరిపోల్చుకుంటూ తెలంగాణ నేతలు కేసీఆర్, కేటీఆర్, కోదండరాంలు దాడులు చేయించి.. అరాచకాలను ప్రోత్సహించడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని అరాచక శక్తులను అణచి వేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
సీమాంధ్ర సినిమా పెద్దలు.. స్టూడియోల పేరిట సర్కారు నుంచి తెలంగాణలో భూముల్ని పొంది దుర్వినియోగం చేసిన విషయాల్ని, ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని జరిపిన వ్యవహారాల్ని బయటపెడితే వారి పరువు ఏమవుతుందని తెరాస నేత, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. 'రాంబాబు' సినిమాలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కించపరిచే అంశాలు ఉన్నాయని, ఇదంతా ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా సాగుతున్న వ్యవహారంగా భావిస్తున్నామని చెప్పారు. సీమాంధ్ర సినీ నిర్మాతలు, దర్శకులకు ఏవైనా రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాలుంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించిన ఈ చలనచిత్రానికి అనుమతిని సెన్సార్ బోర్డును రద్దు చేయాలని కోరారు
No comments:
Post a Comment